గొల్లగుప్ప బాలిక మృతి కేసు, NewzFast Telugu (అమరావతి): అమరావతి, నవంబర్ 11: పోలవరం జిల్లాలోని గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి ఏడేళ్ల విద్యార్థిని జమున మృతి చెందిన ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై స్టేటస్ రిపోర్ట్ ఎస్ఐ దాఖలు చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఇది కోర్టు పట్ల అవిధేయత ప్రదర్శించడమేనని హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును ఎంత సీరియస్‌గా తీసుకున్నారో ఈ నివేదికే స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించింది.
బాలిక మృతికి సంబంధించిన కారణాలను నివేదికలో స్పష్టం చేయలేదని మండిపడింది.
మెడికల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారో లేదో వివరాలు కూడా నివేదికలో లేవని పేర్కొంది. ఫోరెన్సిక్ నివేదికను కూడా జత చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది.
తదుపరి విచారణలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, పోలవరం జిల్లా డీఎం అండ్ హెచ్ఓ, జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది.
పోలవరం జిల్లా గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి ఏడేళ్ల విద్యార్థిని మృతి చెందిన ఈ ఘటనపై తెలంగాణకు చెందిన న్యాయవాది మణిదీప్ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు విచారణ చేపట్టి, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. బుధవారం ఈ కేసును విచారించిన హైకోర్టు, స్టేటస్ రిపోర్ట్‌ను ఎస్ఐ దాఖలు చేయడంపై పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.




