ఐపీఎల్ 2027 వేలం, NewzFast Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ కు సంబంధించిన వేలం దగ్గర పడుతున్న నేపథ్యంలో 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడాలని బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ముస్తాఫిజుర్ రెహమాన్, నహిద్ రాణా, రిషాద్ హుస్సేన్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ వేలం కోసం తాజాగా రిజిస్టర్ చేయించుకున్నారు. బీసీసీఐ నుంచి అనుమతులు రావడంతో బంగ్లా ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం ఏర్పడింది.
అయితే బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఈ నిర్ణయంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఏర్పడింది. ఐపీఎల్ 2027లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆడితే, పాకిస్తాన్ సూపర్ లీగ్ వచ్చే సీజన్‌కు వారు దూరమయ్యే అవకాశం ఉంది.
దీంతో పాకిస్తాన్ క్రికెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఐపీఎల్ 2027, పీఎస్ఎల్ 2027 రెండూ మార్చి 10వ తేదీన ఒకేసారి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఐపీఎల్లో ఆడితే ఆర్థికంగా పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుందని, పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పోలిస్తే అది చాలా ఎక్కువని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ కారణంగా బంగ్లా ఆటగాళ్లు ఐపీఎల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. గతేడాది బంగ్లా ఆటగాళ్లను దూరం పెట్టిన బీసీసీఐ, ఈ సారి వారిని ఎందుకు అనుమతిస్తోందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ఈ విషయంలో ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2027 వేలం డిసెంబర్ 16వ తేదీన గోవాలో నిర్వహించనున్నారు. అంతకు ముందు నవంబర్ 17వ తేదీలోపు రిటెన్షన్, రిలీజ్ జాబితాలను పది ఫ్రాంచైజీలు ఐపీఎల్ కౌన్సిల్‌కు అందజేయాల్సి ఉంటుంది.




