అఖిల భారత కిసాన్ సభ మహాసభలు, NewzFast Telugu (నల్గొండ): 1936లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ 36వ మహాసభలను నల్గొండలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు.
2026 నవంబర్ 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉద్యమాల గడ్డ, తెలంగాణ సాయుధ పోరాట ఖిల్లాగా పేరుగాంచిన నల్గొండ జిల్లాలో ఈ మహాసభలు జరగనున్నాయి. దేశ నలుమూలల నుంచి లక్ష మంది రైతులు హాజరుకానున్నారు.
నవంబర్ 15వ తేదీన ఎంజీ గ్రౌండ్ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సీపీఎం పార్టీ మాజీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ బృందా కరత్ హాజరుకానున్నారు.
నారాయణపేట జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గుండెగారి దస్తప్ప మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో అనావృష్టి కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. వారికి ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.25 వేల చొప్పున పంట నష్టపరిహారం ప్రకటించాలని కోరారు.
అలాగే ఈ జిల్లాలో జీవో 69 కింద సాగు, తాగునీటిని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కోటకొండ గ్రామంలో గోడపత్రికలను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం సభ్యులు, వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కార్పొరేట్ శక్తుల దోపిడీ నుంచి రైతుల భూములను కాపాడాలనే నినాదంతో ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.




