కంగ్టి రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (మెదక్ జిల్లా, కంగ్టి మండలం): మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఒక వృద్ధుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వేగంగా వచ్చిన బొలేరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాద ఘటన బుధవారం ఉదయం కంగ్టి మండలం దేగుల్వాడి గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేగుల్వాడి గ్రామానికి చెందిన నల్చార్ గోవింద్ రెడ్డి (70) ఉదయం పంటకు పిచికారీ చేయడానికి అవసరమైన మందులు, ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు కంగ్టికి వెళ్లారు.
పనులు ముగించుకుని ఆయన తన వాహనంపై స్వగ్రామానికి తిరిగి బయలుదేరారు. ఉదయం 10:40 గంటల సమయంలో గ్రామ శివారుకు చేరుకోగానే, వరంగల్ నుంచి మహారాష్ట్రలోని లాతూర్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం (MH24BW1244) అతివేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఢీకొట్టిన వేగానికి గోవింద్ రెడ్డి వాహనంతో సహా సుమారు 70 నుంచి 80 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ఇంటికి చేరుకోవడానికి కొద్ది నిమిషాల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఈ ఘోర ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.
ప్రమాదం అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య మణికవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
భార్య మణికవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రవిగౌడ్ తెలిపారు.




