యతీంద్ర సప్తతి, NewzFast Telugu (రంగారెడ్డి జిల్లా, ముచ్చింతల్): రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరం సమతామూర్తి ప్రాంగణంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ‘యతీంద్ర సప్తతి’ నాలుగో రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా దేశ రక్షణ, సమాజ సేవలో నిస్వార్థంగా కృషి చేసిన 70 మంది త్యాగధనులకు, సేవానిరతి కలిగిన 70 మంది మాతృమూర్తులకు ‘సమతా పురస్కారాలు’ అందజేసి ఘనంగా సత్కరించారు. సాయంత్రం శ్రీకోదండరామునికి 33వ ఏకోత్తర సహస్ర కలశాభిషేకానికి అంకురారోపణ జరిగింది.
ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి అనుగ్రహ భాషణంలో, దేశంలో కులాలు, మతాలు వేరైనా మనమందరం ఒకే భగవంతుని బిడ్డలమని, ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించిన గొప్ప సమతావాది రామానుజాచార్యులని కొనియాడారు.
సైనికులు దేశ శరీరాన్ని కాపాడితే, జ్ఞానవంతులు దేశ ఆత్మను బలోపేతం చేస్తారని పేర్కొంటూ సేవామూర్తులకు మంగళాశాసనాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ, ఎందరో పాలకులు మారినా భారతీయ సంస్కృతి, ధర్మం సజీవంగా ఉన్నాయంటే దానికి సాధువులు, ఆచార్యుల పాత్రే కారణమని అన్నారు.
బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఉత్సవాలకు విచ్చేయడం పట్ల చిన్న జీయర్ స్వామి సంతోషం వ్యక్తం చేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళా పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ, తమ సేవను గుర్తించి గౌరవించడం గర్వంగా ఉందని, భవిష్యత్తులోనూ సమాజ సేవను కొనసాగిస్తామని తెలిపారు.




