క్వాల్‌కామ్ లేఆఫ్స్, NewzFast Telugu (హైదరాబాద్): టెక్ ఉద్యోగులకు భరోసా లేకుండా పోయింది. చిన్న కంపెనీల నుంచి అతిపెద్ద టెక్ సంస్థల వరకు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి డిగ్రీలు పొందినా కూడా లేఆఫ్స్ తప్పడం లేదు.
తాజాగా ఇంటర్నెట్‌లో ఓ ఉద్యోగి విషయం వైరల్‌గా మారింది. ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ తొలగింపుల్లో ఏడాదికి రూ. 26 లక్షల ప్యాకేజీ కలిగిన ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.
తన స్నేహితుడికి ఎదురైన ఈ చేదు అనుభవాన్ని వికాస్ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
క్వాల్‌కామ్ లేఆఫ్‌లో తన స్నేహితుడి ఉద్యోగం పోయిందని వికాస్ వెల్లడించారు. ఎంతో కష్టపడి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం సాధించినా, చివరకు లేఆఫ్ తప్పలేదని చెప్పారు.
బీటెక్ చదువుతున్న సమయంలోనే తన స్నేహితుడికి సదర్లాండ్ సంస్థలో నాన్-టెక్నికల్ ఉద్యోగ అవకాశం వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరకుండా గేట్ పరీక్షకు సిద్ధమయ్యాడు.
ఒక ఏడాది కష్టపడి గేట్‌లో 1100 ర్యాంక్ సాధించి, ఐఐటీ హైదరాబాద్‌లో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (VLSI) విభాగంలో ఎం.టెక్ చదివాడు. రెండేళ్ల ఎం.టెక్ పూర్తి చేసిన తర్వాత క్వాల్‌కామ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఉద్యోగం పొందాడు.
ఏడాదికి రూ. 18 లక్షల బేస్ శాలరీతో పాటు మొత్తం కాస్ట్ టు కంపెనీ (CTC) రూ. 26 లక్షలకు పైగా ప్యాకేజీ లభించింది.
ఇంత కష్టపడి ఉద్యోగం సాధించినా, అది ఎక్కువ కాలం నిలవలేదని, తాజా లేఆఫ్‌లో ఉద్యోగం పోయిందని వికాస్ తెలిపారు. టెక్ రంగంలో ఉద్యోగాల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
క్వాల్‌కామ్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులను తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగా 3000కు పైగా ఉద్యోగులను సాగనంపుతోంది.
భారత్‌లో సుమారు 1000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, చెన్నై నగరాల్లో కలిపి క్వాల్‌కామ్ సుమారు 20,000 మందికి ఉపాధి కల్పిస్తోంది.
ఇదిలా ఉండగా, జనవరి 2027లో మరోసారి కోతలు ఉంటాయని కంపెనీ చెబుతోంది.




