సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్, NewzFast Telugu (సంగారెడ్డి): ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.
గురువారం సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల దర్యాప్తులో నాణ్యత, పెండింగ్ కేసుల పరిష్కారం, ఎన్‌బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజా భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసుల ఛేదన, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారాలను సేకరించి, నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టాలన్నారు.
నేరస్తులకు న్యాయస్థానంలో శిక్ష పడినప్పుడే పోలీసులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, అక్కడ ప్రమాద సూచిక బోర్డులు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయించాలని అన్నారు.
అనంతరం ఎస్‌హెచ్‌ఓలకు కేటాయించిన పోలీసు వాహనాలను తనిఖీ చేసిన ఎస్పీ, వాటి నిర్వహణ, పనితీరును పరిశీలించారు. ప్రతి వాహనానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించి, అత్యవసర సమయాల్లో తక్షణమే వినియోగించుకునేలా సిద్ధంగా ఉంచాలని డ్రైవర్లను ఆదేశించారు.
వాహనాలను పరిశుభ్రంగా నిర్వహిస్తున్న డ్రైవర్లను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.
వివిధ విభాగాల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, పలువురు డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.




