అనుమతి లేకుండా నీటి తరలింపు, NewzFast Telugu (నాగర్కర్నూల్ జిల్లా, అమ్రాబాద్): నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి గ్రామంలోని కొత్త చెరువులో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఐదు వ్యవసాయ మోటార్లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చెరువులోని నీటిని మోటార్ల ద్వారా పైపుల సహాయంతో వరి పంటలు, మిరప తోటలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చెరువులో నీటిమట్టం తగ్గి పశువులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో గతంలో పలుమార్లు మోటార్లను తొలగించాలని సంబంధిత రైతులను హెచ్చరించారు.
అయినప్పటికీ నీటి తరలింపు కొనసాగించడంతో బుధవారం తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, పోలీసుల సమక్షంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువులో ఏర్పాటు చేసిన ఐదు మోటార్లు, విద్యుత్ వైర్లను తొలగించి స్వాధీనం చేసుకుని అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
మండలంలోని చెరువులు, కాలువల్లో అనుమతి లేకుండా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.




