ఖమ్మం జిల్లా అండర్–17 క్రీడా పోటీలు, NewzFast Telugu (వైరా, ఖమ్మం): ఖమ్మం జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా స్థాయి అండర్–17 క్రీడా పోటీలు వైరా మండలం ముసలిమడుగు (రెబ్బవరం) పాఠశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్‌సీవో రాంబాబు, ప్రిన్సిపాల్ రాధిక హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, విద్యార్థుల జీవితంలో క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.
క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
జిల్లాలోని వివిధ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల నుంచి వచ్చిన అండర్–17 విద్యార్థినులు వివిధ క్రీడా విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు. విద్యార్థినుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ పోటీలు చక్కని వేదికగా నిలుస్తాయని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు.




