సీసీ కెమెరాలు, NewzFast Telugu (సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం): గ్రామాల భద్రతకు సీసీ కెమెరాలు రక్షణ కవచంలా పనిచేస్తాయని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు. సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా కోహెడ మండలం పోరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు.
కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామస్థులను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఏసీపీ పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘా ఉన్న ప్రాంతాల్లో నేరాలకు పాల్పడేందుకు దుండగులు భయపడతారని తెలిపారు.
ఇప్పటికే వీటి ఆధారంగా పలు కీలక కేసులను ఛేదించినట్లు వెల్లడించారు. హుస్నాబాద్ డివిజన్లోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, యువజన సంఘాలు సహకరించాలని ఆయన కోరారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను అవసరమైన మేరకే వినియోగించుకోవాలని ఏసీపీ సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ముఖ్యంగా యువత, విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలని, అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగితే డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గబ్బెడ రజిత, ఎస్ఐ పి.అభిలాష్, కోహెడ పోలీసు సిబ్బంది, గ్రామస్థులు, యువకులు, సీసీ కెమెరాల దాతలు పాల్గొన్నారు.




