పవన్ కళ్యాణ్, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆ పార్టీ అభిమాని అరుణ్ రాసిన లేఖ సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో కాదు, నమ్మకంతో ప్రయాణం చేస్తున్న జనసైనికుడిగా ఈ మాటలు రాస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఒక వ్యూహం ఉంటుందని నమ్ముతున్నామని అరుణ్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన త్యాగాలను గౌరవిస్తున్నామని, అయితే ఆ త్యాగాలు ఎప్పటికీ జనసేన పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టేలా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు మూడు వంతుల వాటా దక్కుతుందని చెప్పుకున్నామని, అయితే క్షేత్రస్థాయిలో చూస్తే ఆ వాటాలో సగం కూడా దక్కలేదనే అనుమానం కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ బీ-ఫారాలు, టీడీపీ రెబెల్స్, జనసేన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పోటీ, స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపం వంటి అంశాలు జనసైనికులను అయోమయంలోకి నెడుతున్నాయని ఆయన తెలిపారు.
2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన కేవలం 21 స్థానాల్లో పోటీ చేసినప్పుడు తాము ఎంతో బాధపడ్డామని అరుణ్ గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు, ఓట్ల చీలిక నివారణ, స్థిరమైన ప్రభుత్వం కోసం ఆ నిర్ణయాన్ని అంగీకరించామని ఆయన చెప్పారు.
పొత్తులో కేటాయించిన స్థానాల్లో కూడా అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేయలేకపోతే, ఆ పొత్తు వల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి కలిగే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జనసేనకు ఒక సువర్ణావకాశమని అరుణ్ అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి, మండలాల్లో పార్టీని బలోపేతం చేయడానికి, రేపటి ఎమ్మెల్యేలు, ఎంపీలను తయారు చేసుకోవడానికి ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని కూడా పొత్తు లెక్కల్లో కోల్పోతే, జనసేన సొంతంగా ఎదిగేది ఎప్పుడని ఆయన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ చెప్పిన 25 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నామని, ఆ మాటను నమ్మి ఎంతోమంది యువకులు తమ సమయాన్ని, డబ్బును, రాజకీయ భవిష్యత్తును జనసేన కోసం వెచ్చించారని అరుణ్ తెలిపారు. ఇప్పటికే దాదాపు 12 ఏళ్లు గడిచిపోయాయని, 2029లో కూడా 30-40 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైతే సొంత రాజకీయ శక్తిగా ఎదిగేది ఎప్పుడని ఆయన ప్రశ్నించారు.
2029 తర్వాత 2034 నాటికి ప్రభుత్వ వ్యతిరేకత, మారే రాజకీయ సమీకరణాలు, కొత్త నాయకత్వాలు, కొత్త సవాళ్లు ఎదురవుతాయని, అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనే హామీ ఎవరు ఇవ్వగలరని ఆయన అడిగారు. రాజకీయాల్లో అవకాశాలు ప్రతిసారీ రావని, వచ్చినప్పుడు వాటిని పార్టీ నిర్మాణానికి ఉపయోగించుకోవాలని సూచించారు.
రాష్ట్రాన్ని బాగు చేయాలనే పవన్ కళ్యాణ్ సంకల్పం గొప్పదని, అయితే రేపు రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి జనసేనను తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యతని అరుణ్ పేర్కొన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని, పొత్తు చర్చల్లో వాటా, అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకత్వానికి అవకాశాలు, రెబెల్స్ సమస్యలపై ముందుగానే స్పష్టమైన నిర్ణయాలు ఉండాలని ఆయన కోరారు.
పొత్తు అంటే పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనం ఉండాలని అరుణ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎంత ముఖ్యమో, క్షేత్రస్థాయిలో జనసేన ఉనికిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆయన లేఖను ముగించారు.




