మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, NewzFast Telugu (జనగామ): విద్యా వైతాళికుడు, భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన 138వ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై, మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. 1923లో కేవలం 35 సంవత్సరాల వయసులోనే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా ఆజాద్ ఎన్నికయ్యారని ఆయన గుర్తు చేశారు. ఆయన జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.
దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి, విద్యా సంస్కరణలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కలెక్టర్ కొనియాడారు. ఆధునిక విద్యా విధానాలు, విద్యా ప్రణాళికల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని, అప్పటివరకు అమలులో ఉన్న విధానాల్లో మార్పులు తీసుకువచ్చి దేశ అవసరాలకు అనుగుణంగా నూతన విద్యా విధానానికి పునాదులు వేశారని తెలిపారు.
దేశంలో వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఐఐటీలు, మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు ఆయన విశేషంగా కృషి చేశారని వివరించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పోరాడారని, ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించిందని తెలిపారు.
ఆజాద్ ఆశయాలు, దేశభక్తి, విద్యారంగానికి ఆయన చేసిన సేవలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, మైనారిటీ ప్రతినిధులు, జిల్లా అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి (ఇంచార్జ్) మురళీధర్ రావు, మైనారిటీ చైర్మన్ మాజిద్ అఫ్సర్, మైనారిటీ సభ్యులు ఖాదర్ షరీఫ్, ఇస్మాయిల్, జబ్బార్, మోసిన్ అబ్బాస్, జిల్లా అధికారులు, ఐడీఓసీ సిబ్బంది, మైనారిటీ సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




