క్వాల్కామ్ లేఆఫ్స్, NewzFast Telugu (భారత్): టెక్ రంగంలో ఉద్యోగుల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా భారత్‌లో సుమారుగా 1000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగాల కోతలకు సంబంధించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ఉద్యోగులు పరిహార ప్యాకేజీ గురించి చర్చించుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్వాల్కామ్ కంపెనీలో సుమారు 52 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో 7 శాతం మందిని తొలగించేందుకు సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దీని వల్ల సుమారు 3600 మంది ఉద్యోగాలు పోతాయి. భారత్‌లో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేసేవారు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు.
లేఆఫ్‌కు గురైన కొందరు ఉద్యోగులు అందించే సెవరెన్స్ ప్యాకేజీ గురించి చర్చించుకుంటున్నారు. మూడు నెలల జీతంతో పాటు సంస్థలో పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా ఒక నెల జీతం చెల్లించే విధంగా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు మూడు రోజుల్లో తొలగింపు పత్రాలపై సంతకాలు చేసి సమర్పిస్తే మరో నెల జీతం అదనంగా ఇస్తామని సంస్థ చెప్పినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు.
ఉద్యోగుల తొలగింపునకు వ్యక్తిగత పనితీరు కారణం కాదని, వ్యాపార అవసరాల ఆధారంగానే లేఆఫ్ ప్రకటిస్తున్నట్లు కంపెనీ నిర్ణయం తీసుకుందని రెడ్డిట్‌లో ఒక ఉద్యోగి చెప్పారు. ఏఐపై పెట్టుబడులు, ఖర్చుల తగ్గింపులో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చని మరో ఉద్యోగి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్ గత నెలలో ఉద్యోగులకు పంపిన మెమోలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా తొలగింపులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, డేటా సెంటర్లు, ఏఐ, కనెక్టెడ్ డివైజెస్ వంటి కొత్త రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది.
Layoffs.fyi ట్రాకర్ ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు 350 టెక్ కంపెనీల్లో 1.42 లక్షలకు పైగా ఉద్యోగాలు పోయాయి.




