మమ్ముట్టి, NewzFast Telugu (వయనాడ్, కేరళ): మలయాళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకూ అభిమాన నటుడు మమ్ముట్టి. చాలా కూల్‌గా సినిమాలు చేసుకుంటూ పోయే మమ్ముట్టి పైకి ఎలాంటి సిద్ధాంతాలూ వల్లించకపోయినా సిపిఎం పార్టీతోనూ నేతలతోనూ సన్నిహితంగా ఉంటారు.
సిపిఎం నేతగానే ఆయన చెలామణిలో ఉన్నారు.
సిపిఎం ఆధ్వర్యంలోని కైరళి టీవీకి ఆయన ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. సిపిఎంకు చెందిన మాజీ సిఎం పినరయి విజయన్‌తో అయితే మమ్ముట్టికి మరీ ఎక్కువ స్నేహ సంబంధాలున్నాయి.
అయితే తాజాగా మమ్ముట్టిపై అదే సిపిఎం కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు విరుచుకు పడుతున్నారు. కైరళి టీవీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి పోవలసిందిగా తిట్టిపోస్తున్నారు.
వ్యక్తిగతంగానూ మమ్ముట్టిపై మండి పడుతున్నారు.
ఇంతటి విమర్శలకు కారణం ఏమిటంటే, ఇటీవల మమ్ముట్టి వయనాడ్‌లోని ఓ బిజెపి నేత గోపాలకృష్ణ ఇంటికి వెళ్లారు. ఆ బిజెపి నేత కూతురి పెళ్లికి మమ్ముట్టిని పిలిచారు.
పెళ్లికి వెళ్లలేకపోవడంతో, ఇంటికి వెళ్లి కొత్త వధువును ఆశీర్వదించాలని ఆయన నిర్ణయించుకున్నారు. వయనాడ్‌లో ఒక కార్యక్రమానికి వచ్చిన మమ్ముట్టి, జిల్లా సిపిఎం నేత రఫీక్‌ను మీరు ఉండిపోండి, నాకు వ్యక్తిగత పని ఉందని చెప్పి బిజెపి నేత ఇంటికి వెళ్లారు.
అంతే, సిపిఎం కార్యకర్తలకు కోపం వచ్చేసింది.
పెళ్లి అనేది వ్యక్తిగత కార్యక్రమమని, మమ్ముట్టి కూడా వ్యక్తిగత హోదాలోనే బిజెపి నేత ఇంటికి వెళ్లారని పలువురు వాదిస్తున్నారు. అయినప్పటికీ ఈ విచక్షణ లేకుండా సిపిఎం క్యాడర్ మమ్ముట్టిని లక్ష్యంగా చేసుకుంది.
ఇటీవల ఆయనకు నాలుగోసారి జాతీయ అవార్డు వచ్చిన నేపథ్యంలో, బిజెపితో సన్నిహితంగా ఉండటం వల్లనే అవార్డు వచ్చిందని వెక్కిరించే స్థాయికి కొందరు కార్యకర్తలు దిగజారారని సమాచారం.
ఈ మొత్తం ట్రోల్ చూసి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బహిరంగంగా మమ్ముట్టికి క్షమాపణలు చెప్పారు. మమ్ముట్టి మాత్రం తనకే సాధ్యమైన చిరునవ్వుతో కూల్‌గా ఉండిపోయారు.
మలయాళ సీమలో మాత్రం కామ్రేడ్లు ఈ అంశంపై దుమారం రేపుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను ఎవరైనా విమర్శిస్తే బిజెపి క్యాడర్‌తో పాటు సంఘ్ పరివారపు అనుచరులు సోషల్ మీడియాలో విపరీతంగా విరుచుకు పడుతుంటారు. అది బిజెపికే పరిమితం కాదని, కేరళ కామ్రేడ్లు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ఈ ఘటన చాటి చెబుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




