మరిపెడ రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం): మరో నాలుగు రోజుల్లో శుభకార్యం జరగాల్సిన ఇంట విషాదం అలుముకుంది. శుభకార్యం పనుల్లో ఉన్న కుటుంబ పెద్దలను కారు రూపంలో మృత్యువు కబళించింది.
స్థానికుల వివరాల ప్రకారం, మండలంలోని లచ్చతండాకు చెందిన బానోతు సామా (50), పద్మ (40) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
బుధవారం పని నిమిత్తం దంపతులు బైకుపై మరిపెడ పట్టణానికి బయల్దేరారు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి వస్తున్న కారు అతివేగంతో వారి బైకును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సామా, పద్మ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న మరిపెడ ఎస్‌హెచ్‌ఓ బానోతు వెంకన్న విచారణ చేపట్టారు.
దంపతుల మృతితో లచ్చతండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.




