భారత్ సమ్మిట్, NewzFast Telugu (హైదరాబాద్): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి.
సుభాష్ రామచందర్ రావు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఇది దేశ ప్రయోజనాల కోసం జరుగుతున్న సమ్మిట్ కాదని, కేవలం దేశ వ్యతిరేక శక్తుల సమాహారమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని ‘యాంటీ భారత్ సమ్మిట్’ అని ఆయన అభివర్ణించారు.
అంతర్జాతీయంగా భారత వ్యతిరేక కుట్రలు పన్నుతున్న వ్యక్తులు, సంస్థలు ప్రోగ్రెసివ్ అలయెన్స్ రూపంలో ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు.
గతంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ ఈ అలయెన్స్ నాయకులతో దిగిన ఫొటోలే వీరి మధ్య ఉన్న సంబంధాలకు నిదర్శనమని ఆయన చెప్పారు. ఢిల్లీలోని 10 జనపథ్‌లో సోనియా గాంధీ, ఖర్గేలు ‘ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్’ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఈ అంతర్జాతీయ సంస్థల వెనుక జార్జ్ సోరోస్ వంటి శక్తులు ఉన్నాయని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడానికి రెజీమ్ చేంజ్ నినాదంతో అవి పనిచేస్తున్నాయని రామచందర్ రావు ఆరోపించారు. స్పెయిన్, ఫ్రాన్స్, అల్బేనియా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో అలజడులు సృష్టించిన కూటమినే ఇప్పుడు కాంగ్రెస్ భారత్‌లోకి తెస్తోందని ఆయన విమర్శించారు.
హైదరాబాద్‌ను శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కేంద్రంగా మార్చుకునే కుట్ర జరుగుతోందని హెచ్చరించారు.
రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే దేశ వ్యతిరేక శక్తులతో సమ్మిట్లు పెట్టడం సరికాదని ఆయన అన్నారు. దేశంలో ఇప్పటికే విఫలమైన రాహుల్ గాంధీని 100 దేశాల ప్రతినిధుల ముందు ప్రధానమంత్రి మెటీరియల్‌గా రీలాంచ్ చేసేందుకే ఈ ప్రయత్నమని ఆయన ఎద్దేవా చేశారు.
42 ఇస్లామిక్ దేశాలు, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న దేశాల ప్రతినిధులతో విదేశీ శక్తుల మద్దతుతో జరుగుతున్న ఈ సమ్మిట్‌ను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రామచందర్ రావు స్పష్టం చేశారు.




