రోషన్ మేక, NewzFast Telugu (హైదరాబాద్): టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక తన కెరీర్లోనే ఒక భారీ ప్రయోగానికి సిద్ధమయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన ఒక ప్రతిష్టాత్మక సూపర్ హీరో యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు.
ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోకా క్రియేషన్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచాన్ చేయగా, హీరో శ్రీకాంత్ తొలి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెంకయ్య చౌదరి దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.
ఇప్పటివరకు లవ్, ఫ్యామిలీ సినిమాలు చేసిన మోహన కృష్ణ ఇంద్రగంటి, రోషన్ ఇద్దరూ తొలిసారిగా సూపర్ హీరో జానర్లోకి అడుగుపెడుతుండటం విశేషం. ప్రొడక్షన్ నంబర్-3గా రాబోతున్న ఈ కథను పక్కాగా తీర్చిదిద్దడానికి దర్శకుడు దాదాపు 18 నెలల పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులపై కష్టపడినట్లు సమాచారం.
ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ రేఖా పాండే టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం కాబోతుండగా, విలక్షణ నటుడు వినయ్ రాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. హనుమాన్, మిరాయ్ సినిమాలతో సంచలనం సృష్టించిన గౌర హరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.




