గోమాతకు సీమంతం, NewzFast Telugu (మధ్యప్రదేశ్, బురన్‌పూర్ జిల్లా): మూగజీవాలను కేవలం జంతువులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించే వారు చాలామంది ఉంటారు. పండుగలు, పబ్బాల సమయంలో వారు తమ పెంపుడు జంతువులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం సాధారణం.
ఇదే భావనతో మధ్యప్రదేశ్‌లోని బురన్‌పూర్ జిల్లా బోర్‌సన్ గ్రామానికి చెందిన రైతు హరిబావు చౌదరి, ఆయన భార్య బేబా బాయి చౌదరి గర్భంతో ఉన్న తమ గోవుకు సీమంతం వేడుక నిర్వహించారు. వారి కుటుంబంలో గోవును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.
ఇంట్లోని గోవు గర్భం దాల్చడంతో, మనుషులకు చేసినట్లుగానే సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను నిర్ణయించుకున్నారు.
ఈ వేడుక కోసం గోవును ప్రత్యేకంగా అలంకరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మహిళలు మంగళహారతులు పాడుతూ గోమాతకు సీమంతం జరిపించారు.
వేడుక అనంతరం బంధువులు, గ్రామ ప్రజలందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. భారతీయ సంప్రదాయంలో గోమాతను పూజించడం భక్తికి ప్రతీక అని, ఈ వేడుక ద్వారా గ్రామాల్లో సౌభ్రాతృత్వం, ఐక్యత చాటుకోవడమే తమ ఉద్దేశమని ఆ రైతు దంపతులు పేర్కొన్నారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




