జాతీయ విద్యా దినోత్సవం, NewzFast Telugu (పెద్దపల్లి): దేశ విద్యా రంగానికి బలమైన పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అన్నారు.
బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ఆజాద ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, 1888 నవంబర్ 11న సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్ అని, అబుల్ కలాం అనేది బిరుదు కాగా ఆజాద్ అనేది కలం పేరు అని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రఖ్యాత పండితుడు, కవి అయిన ఆయన అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ వంటి అనేక భాషల్లో ప్రావీణ్యుడని పేర్కొన్నారు.
స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్ల పాటు సేవలందించిన ఆయన సేవలను స్మరించుకుంటూ, భారత ప్రభుత్వం 2008లో ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఐఐటీ, యూజీసీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ వంటి ప్రముఖ విద్యా, సాంస్కృతిక సంస్థల స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు.
14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందాలని, మహిళా అక్షరాస్యత, సాంకేతిక విద్యను ప్రోత్సహించాలని ఆజాద్ ఆకాంక్షించారని అదనపు కలెక్టర్ వివరించారు. ప్రతి ఏటా పాఠశాలలు, కళాశాలల్లో సెమినార్లు, వ్యాసరచన పోటీలు నిర్వహించి ఆయన ఆశయాలను స్మరించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి జి. రవికుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి.
ప్రకాష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




