రిటైర్డ్ అధికారులు ఈసీ ఆదేశాలు, NewzFast Telugu (నేషనల్): ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల రాజకీయ తటస్థతపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు కూడా సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయని ఈసీ స్పష్టం చేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ ఈ మేరకు అధికారిక లేఖ రాసింది.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం వంటి కార్యకలాపాలకు రిటైర్డ్ సిబ్బంది పూర్తిగా దూరంగా ఉండాలని ఆదేశించింది. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలు లేదా జిల్లాల్లోని ఎన్నికల అధికారులను ఈ రిటైర్డ్ వ్యక్తులు అధికారిక చర్చల కోసం పిలవకూడదని స్పష్టం చేసింది.
వీడియో కాన్ఫరెన్స్‌లు లేదా సమావేశాలు నిర్వహించడంపై కూడా నిషేధం ఉంది.
తమ పేరు, పదవీ ప్రతిష్ట, అధికారాన్ని ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థికి అనుకూలంగా ఉపయోగించకూడదని ఈసీ హెచ్చరించింది. రిటైర్డ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాల్లో తిరిగి నియమితులై ఎన్నికల సమయంలో అధికార ప్రభావం చూపుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు, కమిటీలు, కార్పొరేషన్ల ఉద్యోగులకు ఇప్పటికే ఎంసీసీ నిబంధనలు వర్తిస్తాయని ఈసీ గతంలో స్పష్టం చేయగా, ఇప్పుడు రిటైర్డ్ వర్గాన్ని కూడా దాని పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈసీ హెచ్చరించింది, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
ఎన్నికల స్వేచ్ఛ, న్యాయం, తటస్థతను కాపాడేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఈసీ అధికార వర్గాలు తెలిపాయి.




