చిన్న జీయర్ స్వామి, NewzFast Telugu (ముచ్చింతల్): అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన సేవ అని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. సమాజ సంక్షేమం మనందరి ఉమ్మడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
సమస్త జీవరాశికి సేవ చేయడం అత్యున్నతమైన ధర్మమని బోధించారు.
గుర్తింపు లభించకపోయినా నిస్వార్థంగా సేవ చేస్తున్న మహనీయుల సేవలు మరువలేనివని ఆయన కొనియాడారు. ముచ్చింతల్లో చిన్న జీయర్ స్వామి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యతీంద్ర సప్తతి వేడుకలు కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా దేశసేవ, సమాజసేవలో విశేష కృషి చేసిన 70 మంది సేవామూర్తులకు సమతా పురస్కారాలతో సత్కరించారు. ఈ పురస్కారాలు అందుకున్నవారి సేవలు ఎంతో ప్రశంసనీయమని చిన్న జీయర్ స్వామి అన్నారు.
దేశానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ మంగళాశాసనాలు అందించారు.
సమాజంలో ఎంతోమంది ఎలాంటి గుర్తింపు, ప్రతిఫలం ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇతరుల కష్టాలను అర్థం చేసుకుని, అవసరమైన సమయంలో వారికి తోడుగా నిలవడమే నిజమైన సేవాభావమని వివరించారు.
మన చుట్టూ ఉన్నవారి సంక్షేమం కోసం ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
126 అడుగుల సమతామూర్తి విగ్రహం, 108 దివ్యదేశాల దర్శనం భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయని తెలిపారు. యతీంద్ర సప్తతి వేడుకల్లో భాగంగా ఉదయం ధర్మగోష్ఠి నిర్వహించగా, 70 మంది త్యాగధనులకు సప్తతి పురస్కారాలు అందజేశారు.
మధ్యాహ్నం 70 మంది మాతృమూర్తులను ఆచార్యసేవలో భాగంగా సన్మానించనున్నారు. సాయంత్రం 33వ సహస్ర కలశాభిషేక మహోత్సవానికి అంకురార్పణ కార్యక్రమం జరగనుంది.
ఈ వేడుకల్లో భక్తులు, ఆధ్యాత్మిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.




