పంజాబ్ బస్సు ప్రమాదం, NewzFast Telugu (సంగ్రూర్, పంజాబ్): పంజాబ్‌లోని సంగ్రూర్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగ్రూర్ నుంచి చండీగఢ్‌కు వెళ్తున్న పీఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఫ్లైఓవర్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
అనంతరం బస్సు సమీపంలోని చెట్టును ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సు వేగంగా వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సు ముందు భాగం దెబ్బతినడంతో లోపల ఉన్నవారు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
గాయపడిన 18 మందికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.




