ఏపీ తుఫాన్ హెచ్చరిక, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఇటీవల వచ్చిన తుఫాన్ల ప్రభావం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోకముందే మరో ప్రమాదకర వాతావరణ వ్యవస్థ బంగాళాఖాతంలో రూపుదిద్దుకుంటోందని భారత వాతావరణ శాఖ (IMD) మరియు వాతావరణ నిపుణులు వెల్లడించారు.
నవంబర్ 13 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, తేమ అనుకూలంగా ఉండటంతో ఇది తదుపరి 24 నుంచి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా బలపడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
ఈ వ్యవస్థ తుఫాన్‌గా మారితే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఇరాన్ సూచించిన ‘ఆక్వాన్’ (Akvan) అనే పేరు పెట్టనున్నారు.
ప్రస్తుత వాతావరణ నమూనాల ప్రకారం, ఈ వ్యవస్థ నవంబర్ 16 లేదా 17వ తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర – ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో ఈనెల 15 నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.




