విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు, NewzFast Telugu (హైదరాబాద్): విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలు కట్టుతప్పుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. తల్లిదండ్రులు రూ.లక్షలు చెల్లించి పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నప్పటికీ, కొన్ని యాజమాన్యాలు విద్యార్థులను తమ రాజకీయ, కుటుంబ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో అనేక అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడమే కాకుండా, కొన్నిసార్లు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇష్టారీతిగా సెలవులు ప్రకటించడం, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా భారీ కార్యక్రమాలు చేపట్టడం పరిపాటిగా మారిందని ప్రభుత్వం, తల్లిదండ్రులు, విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విద్యాసంస్థల్లో సినిమా, ఇతర ప్రైవేటు కార్యక్రమాల ప్రచారంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విద్యాసంస్థలు చట్టపరంగా తమ క్యాంపస్లలో ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చు, ఏవి నిర్వహించకూడదు అనే అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖాధికారులను ఆదేశించింది.
ఈ దిశగా మార్గదర్శకాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం, పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలను విద్య, క్రీడా కార్యక్రమాలకు మినహా సినిమా, ఇతర వాణిజ్య కార్యక్రమాలకు వినియోగించకూడదు. విద్య, క్రీడా కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించాలనుకుంటే, ఎంత మంది హాజరవుతారు, స్టేజీ నిర్మాణం, రాకపోకల ఏర్పాట్లు వంటి వివరాలను ముందుగానే స్థానిక విద్యాశాఖ అధికారులు పోలీసులు, అగ్నిమాపక శాఖలకు అందజేయాలి.
వందలాది మందితో నిర్వహించే క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో విద్యాసంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించనున్నారు. లేనిపక్షంలో భారీ జరిమానాలతో పాటు ఇతర చర్యలు తీసుకునే అవకాశం ఉందని మార్గదర్శకాల్లో స్పష్టం చేయనున్నారు.
కళలు, సంస్కృతి, క్రీడలు, స్టార్టప్ ఈవెంట్లు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాసంస్థలను విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం, యంగ్ ఇండియా ఫిల్మ్ మేకర్ చాలెంజ్ వంటి కార్యక్రమాలను విద్యాశాఖ నిర్వహించింది.
అయితే కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ ఆదేశాలకు భిన్నంగా, తాము సూచించిన సినిమాలు చూడాలంటూ సెలవులు ప్రకటించడం వివాదాస్పదమైంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
ఇటీవల ఒక విద్యాసంస్థలో వేదిక కూలి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు మార్గదర్శకాలు విడుదల చేయనుంది.




