కోస్తా తుఫాన్ ముప్పు, NewzFast Telugu (విశాఖపట్నం): రెండు వరుస తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయిన కోస్తాంధ్రకు మరో తుఫాన్ గండం పొంచి ఉంది. అయితే ఇది తుఫాన్‌గానే తీరం దాటుతుందా లేదా అన్నది నిపుణులు ఇంకా స్పష్టం చేయలేదు.
ప్రస్తుత అంచనా ప్రకారం తుఫాన్ లేదా తీవ్ర వాయుగుండం ఈ నెల 16, 17 తేదీల్లో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటుతుందని పలు వాతావరణ మోడల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపారు.
ఆ తర్వాత 24 గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. 15వ తేదీ నాటికి వాయుగుండంగా మారి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి, మరింత బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని మోడల్స్ సూచిస్తున్నాయి.
అయితే భూ ఉపరితలం నుంచి సముద్రం వైపు పొడి గాలులు వీస్తున్నందున, తీరం దాటకముందే తుఫాన్ సముద్రంలో కొంత బలహీనపడవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా ఒంగోలు, చెన్నై, పుదుచ్చేరి వద్ద తీరం దాటే అవకాశం ఉందని వారు తెలిపారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో చలి పెరిగింది. వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో మంగళవారం ఉదయం చలి గాలులు వీయగా, కొన్నిచోట్ల మంచు కురిసింది.
ఆరోగ్యవరంలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
రానున్న రెండు, మూడు రోజుల్లో పొడి వాతావరణమే కొనసాగుతుందని, చలి స్వల్పంగా పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.




