క్లౌడ్ కిచెన్ తనిఖీలు, NewzFast Telugu (హైదరాబాద్): నగరంలో టీజీ సేఫ్ అధికారులు 23 క్లౌడ్ కిచెన్లు, రెస్టారెంట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఆహారాన్ని అపరిశుభ్ర వాతావరణంలో, కాలం ముగిసిన పదార్థాలతో తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో 8 క్లౌడ్ కిచెన్లు, రెస్టారెంట్ల లైసెన్సులను రద్దు చేశారు. గచ్చిబౌలిలోని బిర్యానీ బైకి సంస్థ లైసెన్స్ కూడా రద్దు చేయబడింది.
మాదాపూర్‌లోని కుల్చాకల్చర్, సోమాజిగూడలోని లక్కీ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్, టామ్ యమ్ ఇన్నోవిజన్స్, జోరా 11బై 2, ఐటీసీ ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్ క్లౌడ్ కిచెన్, సోడెక్సో ఇండియా సర్వీసెస్‌ల లైసెన్సులను సస్పెండ్ చేశారు. అమీర్‌పేటలోని కాకతీయ మెస్, మియాపూర్‌లోని ప్రిజం హాస్పిటాలిటీ సర్వీసెస్, శేరిలింగంపల్లిలోని రెబల్ ఫుడ్స్ తో పాటు మరో ఏడు సంస్థలకు షోకాజు నోటీసులు జారీ చేశారు.
అదనంగా మరో ఐదు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందజేశారు. తనిఖీల్లో భాగంగా అపరిశుభ్రంగా ఉన్న సుమారు 700 కిలోల ఆహారాన్ని అధికారులు ధ్వంసం చేశారు.
తనిఖీల సమయంలో పలు రెస్టారెంట్లలో దెబ్బతిన్న ఫ్లోరింగ్, వంటగదుల్లో పేరుకుపోయిన ఆహార వ్యర్థాలు, సరిగా లేని వాషింగ్ ఏరియా, పూడుకుపోయిన డ్రైనేజీలు, జిడ్డుపట్టిన ఎగ్జాస్ట్ వ్యవస్థలు ఉన్నట్టు గుర్తించారు.




