తండ్రి పేరు తప్పనిసరి కాకూడదు, NewzFast Telugu (విజయవాడ): ఏ బిడ్డకూ తండ్రి వివరాలు లేవనే కారణంతో విద్య, గుర్తింపు పత్రాలు, సంక్షేమ పథకాలు, ఇతర కీలక సేవలు దూరం కాకూడదని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీఎస్సీపీసీఆర్) చైర్మన్ వేటుకూరి రాజు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఫారాలు, అధికారిక రికార్డుల్లో తండ్రి పేరు తప్పనిసరి కాకుండా చేసేందుకు సమగ్ర పరిపాలనా సంస్కరణలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. చిల్డ్రన్ ఇండియా ఫౌండేషన్, ఏపీఎస్సీపీసీఆర్ సంయుక్తంగా మంగళవారం విజయవాడలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించాయి.
ప్రతి బిడ్డకూ స్వతంత్రంగానే హక్కులు ఉంటాయని వేటుకూరి రాజు స్పష్టం చేశారు. వారికి ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం, భవిష్యత్తు తల్లిదండ్రుల వైవాహిక స్థితి, కుటుంబ పరిస్థితులు, సామాజిక హోదాపై ఆధారపడి ఉండకూడదన్నారు.
దరఖాస్తుల్లో తండ్రి పేరు తప్పనిసరిగా వెల్లడించాలని ఒత్తిడి చేసినప్పుడు ఒంటరి తల్లుల పిల్లలు, అవివాహిత మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీ బాధితులకు పుట్టిన సంతానం, ఇతరుల సంరక్షణలో ఉంటున్న పిల్లలు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి నిబంధనలు జనన ధ్రువీకరణ పత్రాలు, పాఠశాల ప్రవేశాలు, స్కాలర్షిప్లు, గుర్తింపు పత్రాలు, సంక్షేమ ప్రయోజనాలు పొందడంలో అడ్డంకులు సృష్టిస్తాయని చెప్పారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ, పిల్లల కుటుంబ పరిస్థితులను పదే పదే ప్రశ్నించడం వల్ల వారిలో మానసిక ఆందోళన, అవమాన భావన కలుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంకే విజయలక్ష్మి, విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామారావు, జువైనల్ వెల్ఫేర్ అధికారి రమణారెడ్డి తదితరులు ప్రసంగించారు.




