ఎంపీపీ జడ్పీ ఛైర్మన్ ఎన్నిక, NewzFast Telugu (చిత్తూరు, తిరుపతి): తిరుపతి, నవంబరు 10: జిల్లాలోని 35 మండల పరిషత్‌లకు 19వ తేదీన, జిల్లా పరిషత్‌కు 20వ తేదీన నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు కో ఆప్షన్ సభ్యుల పదవులకు ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం జారీ అయింది.
ఈనెల 14వ తేదీలోపు జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఎంపీటీసీ సభ్యులకు ఈనెల 19న, జడ్పీటీసీ సభ్యులకు 20న ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.
సభ్యులు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంటారు.
19వ తేదీన జిల్లావ్యాప్తంగా 35 మండల పరిషత్‌లలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. ఉదయం 10 గంటలలోపు కో ఆప్షన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 10 నుంచి 12 గంటల మధ్య నామినేషన్ల పరిశీలన జరిగి, 12 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.
మండల పరిషత్‌లో కో ఆప్షన్ సభ్యుడు ఒక్కరే ఉంటారు. మతపరమైన లేదా భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్గాల నుంచి మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది.
మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తారు.
ఈ సమావేశాలకు తప్పనిసరిగా కోరమ్ ఉండాలి. ఇది ఆయా మండల పరిషత్‌లలో ఎంపీటీసీ సభ్యుల సంఖ్యను బట్టి ఉంటుంది.
కోరమ్ లేకపోతే సమావేశాలు నిర్వహించరు. కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరగని పక్షంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు కూడా నిర్వహించరు.
కో ఆప్షన్ ఎన్నిక జరిగినా ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు ఆగిపోతే, మరుసటి రోజు అంటే 20వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు.
20వ తేదీన చంద్రగిరిలోని జడ్పీ కార్యాలయంలో లేదా కలెక్టర్ నిర్ణయించే మరో ప్రదేశంలో జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కో ఆప్షన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీలో కో ఆప్షన్ సభ్యుల పదవులు రెండు ఉంటాయి.
ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ ఎన్నికలకు అనుసరించే సమయాలు, నిబంధనలే జిల్లా పరిషత్‌లోనూ అమలు చేస్తారు.
ముందుగా 35 మంది జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత రెండు కో ఆప్షన్ సభ్యుల పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు.
అనంతరం ప్రత్యేక సమావేశంలో జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నిక జరుగుతుంది.




