నెల్లిమర్ల ఎంపిపి పీఠం, NewzFast Telugu (విజయనగరం): గడిచిన సాధారణ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్న జనసేన, ప్రస్తుతం ప్రతికూలతను ఎదుర్కొంటోంది. తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఇచ్చిన స్థానాలను ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది.
పైగా, ఎంపిపి స్థానం కోసం మడతపేచీ పెడుతుండటంతో ఇది టిడిపి నాయకులకు తలనొప్పిగా మారింది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వైసిపితో హోరాహోరీగా తలపడిన కూటమికి, ఇప్పుడు పదవుల పంపకంలో అసలు పరీక్ష ఎదురవుతోంది.
నెల్లిమర్ల ఎంపిపి పీఠం కోసం జరుగుతున్న మంతనాలు, మడత పేచీలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి.
కూటమి పార్టీల అవగాహనలో భాగంగా నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, జామి, గుర్ల జెడ్‌పిటిసి స్థానాలను జనసేనకు కేటాయించారు. అందులో డెంకాడ, పూసపాటిరేగ మినహా మిగిలిన మూడు చోట్ల ఆ పార్టీ ఓడిపోయింది.
నెల్లిమర్ల మండలంలో మొత్తం 15 ఎంపిటిసి స్థానాలు ఉండగా, టిడిపి ఐదు, జనసేన రెండు స్థానాల్లో గెలుపొందగా, వైసిపి ఏడు స్థానాల్లో విజయం సాధించింది. బూరాడపేట ఎపిటిసి స్థానంలో టిడిపి రెబల్ గెలుపొందారు.
జెడ్‌పిటిసి స్థానాన్ని కోల్పోయినందున కనీసం ఎంపిపి పదవినైనా ఇవ్వాలని జనసేన పట్టుబడుతుండటంతో టిడిపికి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి తన పార్టీకి చెందిన ఇద్దరు ఎంపిటిసి సభ్యులను రహస్య క్యాంపునకు తరలించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తమకు పదవి దక్కకపోతే మద్దతు విషయంలో పునరాలోచించాల్సి వస్తుందన్న సంకేతాలు ఇస్తున్నట్లు కూడా సమాచారం.
ఈ పరిణామంతో టిడిపి నాయకులు అప్రమత్తమయ్యారు. సంఖ్యా బలాన్ని కూడగట్టి ఎంపిపి పీఠాన్ని దక్కించుకోవచ్చన్న అంచనాల్లో ఉన్న తరుణంలో జనసేన మెలికతో అధిష్ఠానం జోక్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పదవుల పంచాయితీ కూటమి ఐక్యతకు పరీక్షగా మారడం చర్చనీయాంశంగా మారింది.




