ఆలూరు టీడీపీ, NewzFast Telugu (ఆలూరు, కర్నూలు జిల్లా): ఆలూరు నియోజకవర్గ రాజకీయాల్లో టీడీపీ తన పట్టును మరింత బిగించింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార కూటమికి అనుకూలంగా రావడంతో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం నెలకొంది.
ఆరు మండలాల్లో 66 ఎంపీటీసీ స్థానాలను కూటమి పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి సొంత మండలంలోనూ జడ్పీటీసీతో పాటు ఎంపీపీ స్థానాన్ని టీడీపీ దక్కించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ ఎంపీపీ పీఠాలను కూటమి ఖాతాలో వేసుకునే దిశగా టీడీపీ పావులు కదుపుతోంది. ఈనెల 19న జరగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆరు మండలాలకు ఎంపీపీ అభ్యర్థులను వైకుంఠం జ్యోతి ఖరారు చేసినట్లు సమాచారం.
ఆలూరు మండలానికి తనయుడు వైకుంఠం సాయి శ్రీరామ్, చిప్పగిరికి మీనాక్షినాయుడు, ఆస్పరికి కృష్ణయాదవ్, హాలహర్వికి గుమ్మనూరు గిరిజ, దేవనకొండకు ఈడిగ లక్ష్మి, హొళగుందకు జయలక్ష్మి పేర్లను ప్రకటించారు.
ఎంపీపీ అభ్యర్థుల ఖరారుతో ఇప్పుడు వైస్ ఎంపీపీ పదవులపై రాజకీయ వేడి మొదలైంది. కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎంపీటీసీలు ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు.
సామాజికవర్గాల వారీగా తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ పలువురు నాయకులు టీడీపీ ఇన్చార్జిని కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు కోఆప్షన్ సభ్యుల ఎంపికపై మైనారిటీ వర్గాల నాయకుల్లో ఆశలు పెరిగాయి.
ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి, దేవనకొండ మండలాల జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుచుకోవడంతో టీడీపీ బలం స్పష్టమైంది. ఈ విజయాలతో స్థానిక సంస్థలపై పట్టు సాధించిన టీడీపీ, మండల పరిషత్ పాలనలోనూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతోంది.
జడ్పీ చైర్మన్ పదవి కోసం దేవనకొండ మండల జడ్పీటీసీ డాక్టర్ షేక్ సాదికకు అవకాశం ఇప్పించేందుకు వైకుంఠం జ్యోతి విజయవాడలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజికవర్గానికి చెందిన సాదికకు జెడ్పీ పీఠాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతామని టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి పేర్కొన్నారు. వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ పదవులు ఎవరిని వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.




