పాయల్ శంకర్ రైతు యాత్ర, NewzFast Telugu (తెలంగాణ): బీజేపీ బీజేఎల్పీ ఉప నాయకుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు రైతు యాత్ర చేయాలని అనుకున్నారు. దసరా తర్వాత తన యాత్ర ఉంటుందని ఆయన ప్రకటించారు.
దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం కూడా జరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ, దసరాతో పాటు దీపావళి కూడా ముగిసిపోయినా యాత్ర ప్రారంభం కాలేదు.
పార్టీ నుంచి అనుమతి రాలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తెలంగాణ బీజేపీ ఇటీవల తన వ్యూహాన్ని మార్చుకుంది. వ్యక్తి కేంద్రంగా కాకుండా పార్టీ కేంద్రంగా జరిగే కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
స్థానిక సమస్యలపై ఆందోళనలు, నిరసనలకు నాయకత్వం అనుమతి ఇస్తోంది. ఎంపీ ఈటల రాజేందర్ జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా పాదయాత్ర చేయగా, నిజామాబాద్‌లో రైల్వే బ్రిడ్జి కోసం ఆందోళన జరిగింది.
ఈ నేపథ్యంలో పాయల్ శంకర్ యాత్రకు అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఆయన యాత్ర మార్గమేనని కమలం వర్గాలు చెబుతున్నాయి. వివిధ నియోజకవర్గాల మీదుగా హైదరాబాద్ వరకు సాగే ఈ యాత్రలో మధ్యలో అభ్యంతరాలు, అంతర్గత విభేదాలు తలెత్తవచ్చని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
స్థానిక కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది కానీ సుదూర యాత్రకు అనుమతి ఇవ్వడం కష్టమని వారు పేర్కొంటున్నారు.
మరోవైపు పాయల్ శంకర్ ఈ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం, పార్టీ జెండాతోనే యాత్ర చేస్తానని చెబుతున్నప్పటికీ అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొందరు నేతలు కావాలనే అడ్డుకుంటున్నారని అంతర్గత చర్చల్లో చెబుతున్నట్లు సమాచారం.
ఈ పరిస్థితుల్లో పాయల్ శంకర్ తదుపరి అడుగు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. తన నియోజకవర్గానికే పరిమితమవుతారా, లేక ఈ యాత్రను ముందుకు తీసుకెళ్తారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.




