చెరకు ధర, NewzFast Telugu (సంగారెడ్డి): చెరకు రైతులకు గిట్టుబాటు అయ్యేలా ఫ్యాక్టరీ యాజమాన్యాలు మద్దతు ధర నిర్ణయించి చెల్లించాలని అదనపు కలెక్టర్ సంగీత సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చక్కెర ఫ్యాక్టరీల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, చెరుకు రైతులు, చక్కెర శాఖ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఫ్యాక్టరీ యాజమాన్యాలు ధర నిర్ణయించాలని సూచించారు. రైతులకు, ఫ్యాక్టరీలకు నష్టం కలగకుండా సహేతుకమైన ధర ఖరారు చేయాలన్నారు.
రైతుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు, మూడు రోజుల్లోగా చెరకు మద్దతు ధరతో పాటు రవాణా చార్జీలను నిర్ణయించి ప్రకటించాలని ఫ్యాక్టరీ ప్రతినిధులకు సూచించారు. నిర్ణయించిన ధర వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని ఆదేశించారు.
ఎల్‌నినో ప్రభావంతో నీటి వినియోగం అధికంగా ఉండే వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో రైతులు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో చెరకు దిగుబడులు తగ్గడంతో పాటు సాగు ఖర్చులు భారీగా పెరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీలు ప్రస్తుతం చెల్లిస్తున్న ధర కంటే అధికంగా చెల్లించాలని కోరారు.
చెరకు టన్నుకు కనీసం రూ.5 వేల మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో చెరకుకు మెరుగైన ధర లభిస్తోందని, అక్కడి ఫ్యాక్టరీలకు చెరకు సరఫరా చేసుకునే అవకాశం కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఎరువులు, డీజిల్ ధరల పెరుగుదలతో పాటు చెరకు నరికే కూలీల ఖర్చులు, రవాణా వ్యయాలు కూడా పెరిగాయని వివరించారు.
ఈ సమావేశంలో సీడీసీ సంగారెడ్డి చైర్మన్, రాష్ట్ర చెరకు పరిశ్రమల పునరుద్ధరణ కమిటీ సభ్యుడు జి.రాంరెడ్డి, సీడీసీ రాయికోడ్ చైర్మన్ ఎం.డి.మోబిన్, రైతు ప్రతినిధులు, ఫ్యాక్టరీ ప్రతినిధులు, చక్కెర శాఖ అధికారులు పాల్గొన్నారు.




