బంగాళాఖాతంలో అల్పపీడనం, NewzFast Telugu (బంగాళాఖాతం): బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) వర్ష హెచ్చరిక జారీ చేసింది.
నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఆ అల్పపీడనం 24 గంటల్లో బలపడి వాయవ్య దిశగా కదలనుందని అంచనా వేసింది.
దాని ప్రభావంతో నవంబర్ 14 నుంచి 16 మధ్య కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో వర్ష సూచన ఉందని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్ దీవుల్లో పలు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
తమిళనాడు తీరంలో గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా నవంబర్ 12న కశ్మీర్ లోయలో భారీ వర్షాలు, హిమపాతం సంభవించవచ్చని హెచ్చరించింది.
అయితే ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా అనే విషయంపై ఐఎండీ ఇంకా ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వర్షాలు తగ్గి చలికాలం మొదలైంది.
ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతున్న తరుణంలో, వాతావరణంలో మళ్లీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.




