నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు, NewzFast Telugu (కామారెడ్డి): కామారెడ్డి జిల్లాలో ప్రముఖ యూనివర్సిటీ పేరుతో నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల దందా సాగిందన్న ప్రచారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లు కష్టపడి చదివి లక్షల రూపాయల ఫీజులు చెల్లించి సంపాదించే ఇంజనీరింగ్ పట్టా, కేవలం రెండు మూడు లక్షల రూపాయలకే లభిస్తోందన్న ఆరోపణలు ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాలో దాదాపు యాభై మందికి ఈ తరహా సర్టిఫికెట్లు విక్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. సర్టిఫికెట్లలో తొంభై నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు మార్కులు చూపించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
నిజంగా చదివిన విద్యార్థికే రాని మార్కులు ఈ సర్టిఫికెట్లలో ఎలా నమోదయ్యాయన్నదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ సంఖ్య ఎంతవరకు వాస్తవమన్నది, సర్టిఫికెట్లను ఎవరు తయారు చేశారు, ఎక్కడ ముద్రించారు, ఎవరి ద్వారా కొనుగోలు చేశారు అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సర్టిఫికెట్లు చూడటానికి ఒరిజినల్లా ఉండటమే కాకుండా, యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా ఒరిజినల్‌గా కనిపిస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది.
ఇదే నిజమైతే ఈ దందా వెనుక పెద్ద నెట్వర్క్ ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ వ్యవహారంలో విదేశీ ప్రయాణాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన కొందరు వాటి ఆధారంగా విదేశాలకు వెళ్లినట్లు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిపైనా ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఉద్యోగాలు, ఉన్నత విద్య, విదేశీ వీసాల కోసం సర్టిఫికెట్లు వినియోగించారా అనే కోణంలోనూ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
సర్టిఫికెట్లు కొనుగోలు చేసినవారితో పాటు, వాటిని తయారు చేసినవారు, విక్రయించిన మధ్యవర్తులు, దందా వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించడం కీలకమని భావిస్తున్నారు.
ఆస్తులు అమ్మి, అప్పులు చేసి పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రులకు ఈ ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కష్టపడి చదివిన విద్యార్థులకు ఇది అన్యాయం చేయడమే కాకుండా, అర్హులైన నిరుద్యోగులకు అవకాశాలు దూరమవుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులు, యూనివర్సిటీ అధికారులు అధికారికంగా స్పష్టత ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.




