ఆశా వర్కర్లు, NewzFast Telugu (నారాయణపేట): తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా తెలంగాణ ఆశ వర్కర్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పీఏ మాధవరెడ్డికి వినతి పత్రం అందించారు.
యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలమణి, అనురాధ, సిఐటియు జిల్లా నాయకులు నరహరి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరు బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలని, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి, పట్టణాల్లో 2,000 నుండి 5,000 మందికి సేవలందిస్తున్నారని చెప్పారు.
గర్భిణులకు ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడటం, సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో ఆశాలు కీలక పాత్ర పోషిస్తున్నారని వారు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కట్టడిలో కూడా వీరి పాత్ర కీలకమని, డబ్ల్యూహెచ్ఓ ఆశాలను గ్లోబల్ లీడర్స్‌గా ప్రకటించిందని గుర్తు చేశారు.
ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు సబ్ సెంటర్ డ్యూటీలు, ఏఎన్సీ, పిఎన్సి, టార్గెట్లు, ఎన్సిడి ఆన్లైన్ సర్వే, స్పూటమ్ డబ్బాల తరలింపు, ఎగ్జామ్ డ్యూటీలు, డ్రై డే, ఫ్రైడే లెప్రసీ, పల్స్ పోలియో వంటి అనేక పనులు చేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రంలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం లేదని, కేవలం రూ.9,900 మాత్రమే పారితోషికంగా చెల్లిస్తున్నారని వారు చెప్పారు.
ఐదేళ్లుగా పారితోషికాలు పెరగలేదని, నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో ఆశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. గతంలో 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె జరిగిందని, అక్టోబర్ 9న హైదరాబాద్ కోఠి కమిషనర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా సందర్భంగా అప్పటి ప్రభుత్వం చర్చలు జరిపి ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ వేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీలను అమలు చేయాలని యూనియన్ డిమాండ్ చేసింది. 2024 ఫిబ్రవరి 9, జూలై 30, డిసెంబర్ 10 తేదీల్లో జరిగిన చర్చల్లో రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50,000 అంత్యక్రియల ఖర్చులు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, సెలవులు, టార్గెట్ల రద్దు, స్పూటమ్ డబ్బాల తరలింపు రద్దు, ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తామని, రూ.18,000 ఫిక్స్డ్ వేతనానికి ఫైల్ ప్రాసెస్‌లో ఉందని చెప్పినప్పటికీ ఇంకా అమలు కాలేదని వారు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో పారిశ్రామిక వివాదాల చట్టం-1947లోని సెక్షన్-22 (1) ప్రకారం సమ్మె నోటీసు ఇస్తున్నట్లు యూనియన్ ప్రకటించింది. కార్యక్రమంలో నారాయణపేట నియోజకవర్గ ఆశా యూనియన్ నాయకులు శ్రీదేవి, నిర్మల, ఉమ, భాగ్యమ్మ, పార్వతమ్మ తదితరులతో పాటు నారాయణపేట, ధన్వాడ, మరికల్, దామరగిద్ద మండలాల నుండి 50 మందికి పైగా ఆశా వర్కర్లు పాల్గొన్నారు.




