యాసంగి ప్రత్యామ్నాయ పంటలు, NewzFast Telugu (హాలియా, నల్గొండ జిల్లా): ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్‌లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సూచించారు. వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆయన కోరారు.
మంగళవారం సాయంత్రం ఆయన పులిమామిడి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని, భూగర్భ జలమట్టాలు కూడా పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా వరి సాగు చేయడం వల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగి భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ పరిమిత విస్తీర్ణంలో మాత్రమే వరి సాగు చేయాలని సూచించారు.
మిగిలిన భూముల్లో ఉద్యాన పంటలు, మెట్ట పంటలు సాగు చేసుకోవడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, తేమ శాతం సరిగ్గా ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి చంద్రశేఖర్, హాలియా డివిజన్ సహాయ సంచాలకురాలు సరిత, మండల వ్యవసాయ అధికారి వెంకన్న, ఉద్యానవన అధికారి మురళి, డీటీ ఎన్‌ఎస్ ప్రవీణ్, ఆర్ఐ విఘ్నేశ్వర్ రెడ్డి, ఏపీఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.




