భూ రీసర్వే, NewzFast Telugu (తెలంగాణ): తరతరాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను పారదర్శకంగా, శాస్త్రీయంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో భూ యజమానుల ప్రయోజనాలు, వారి అభిప్రాయాలు, మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న భూ సర్వే పురోగతిపై మంగళవారం సచివాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల నుంచి వస్తున్న స్పందన, సాంకేతిక అంశాలు, సర్వే సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు.
సర్వే సిబ్బందితో స్వయంగా ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి, నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు వెయ్యి గ్రామాల్లో రీసర్వే మైలురాయిని దాటగా, 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. 125 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు నాణ్యత, పారదర్శకత, కచ్చితత్వం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. సర్వే ప్రారంభానికి ముందు ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించాలని, రికార్డుల్లో ఉన్న వివరాలు, భూముల విస్తీర్ణం, హక్కులు, సరిహద్దులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించాలని సూచించారు.
సర్వే పూర్తయిన అనంతరం సంబంధిత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని, నమోదైన వివరాలను పరిశీలించుకునేందుకు, అభ్యంతరాలు తెలియజేసేందుకు తగిన అవకాశం కల్పించాలని మంత్రి ఆదేశించారు. వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు.
గ్రామస్థాయిలో రైతులకు, భూ యజమానులకు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, అపోహలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు.
రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూమికి ఆధార్ నంబర్ తరహాలో ప్రత్యేక గుర్తింపునిచ్చే భూదార్ నంబర్ కేటాయింపు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి చెప్పారు. భూముల వివరాలు, హక్కులు, సరిహద్దులకు సంబంధించి స్పష్టమైన రికార్డులు అందుబాటులోకి తీసుకురావాలని, భవిష్యత్తులో కొత్త భూ సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లా వారీగా పురోగతిని సమీక్షించి తదుపరి కార్యాచరణపై ఆదేశాలు ఇవ్వనున్నట్లు మంత్రి నిర్ణయించారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జాయింట్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




