సింగరేణి బొగ్గు, NewzFast Telugu (కొత్తగూడెం): రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో తెలంగాణలో విద్యుత్ అవసరాలకు కొరత రాకుండా సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించింది.
ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రోజుకు కనీసం 16 వేల టన్నుల బొగ్గు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, తెలంగాణ జెన్‌కో సీఎండీ డాక్టర్ హరీష్ అధ్యక్షతన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది.
ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో బొగ్గు సరఫరాను మరింత పెంచడంపై చర్చించారు. తెలంగాణ జెన్‌కో విద్యుత్ కేంద్రాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని సీఎండీ డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లను ఆదేశించారు.
గత మూడు, నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణ జెన్‌కోకు అధికంగా బొగ్గు సరఫరా చేస్తున్నామని, రాష్ట్ర అవసరాలు పెరిగితే సంస్థ సామర్థ్యం మేరకు మరింత బొగ్గు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు.
ఒడిశాలోని నైనీ గనిలో ప్రస్తుతం రోజుకు సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే అక్కడ 3 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉందని సీఎండీ తెలిపారు. యాదాద్రి ప్లాంట్‌కు బొగ్గు రవాణా వేగవంతం చేయాలని సూచించారు.
స్థానిక రవాణా సమస్యల కారణంగా కొంత జాప్యం జరుగుతోందని, ఈ నెలాఖరు నుంచి రోజుకు 16 వేల టన్నుల బొగ్గు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జెన్‌కో సీఎండీ డాక్టర్ హరీష్ వివరించారు. నైనీ గని నుంచి రైల్వే సైడింగ్ వరకు రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇతర రాష్ట్రాల జెన్‌కోలు, ప్రైవేట్ సంస్థలు కూడా నైనీ బొగ్గు కోసం ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో తెలంగాణ అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. జెన్‌కో అధికారులతో సమన్వయం చేసుకుంటూ బొగ్గు రవాణాను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె.
వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, తిరుమలరావు, ఈడీ బి. వెంకన్న, జీఎం టి.
శ్రీనివాస్, తెలంగాణ జెన్‌కో డైరెక్టర్ నాగ్య, థర్మల్ విద్యుత్ కేంద్రాల చీఫ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




