సదాశివపేట వ్యాపారులు, NewzFast Telugu (సదాశివపేట, సంగారెడ్డి జిల్లా): సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సదాశివపేట పట్టణంలో పర్యటించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని వ్యాపారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పట్టణంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో పర్యటిస్తూ వివిధ దుకాణాల యజమానులు, వ్యాపారులను ఆప్యాయంగా పలకరించారు. వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయి, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వినియోగదారుల కొనుగోలు శక్తి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వ్యాపారులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గతంతో పోలిస్తే నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరగడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని, దాని ప్రభావం వ్యాపారాలపై కూడా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కెట్‌లో కొనుగోళ్లు తగ్గిపోయాయని, గతంలో మాదిరిగా వ్యాపారం జరగడం లేదని తెలిపారు.
ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోవడంతో చిన్నచిన్న వ్యాపారాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఎమ్మెల్యే వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.
దీనిపై పలువురు వ్యాపారులు స్పందిస్తూ, నిత్యావసర ధరల పెరుగుదలతో పాటు వివిధ రంగాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మార్కెట్‌లో వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో సాగడం లేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
వ్యాపారుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




