రేణు దేశాయ్, NewzFast Telugu: టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా అధికారికంగా విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఈ దిశగా విమర్శలు వస్తున్న సమయంలో ఆమె ఈ పోస్ట్ చేశారు.
ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింత దూషించడం, ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నవారిని మానసికంగా తొక్కాలని చూడటం అమానుషమని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ వారు కూడా సామాన్య మనుషులేనని, ఎవరికో ఒకరికి సంతానంగా, తల్లిదండ్రులుగా లేదా తోబుట్టువులుగా ఉంటారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు.
మనమందరం అసంపూర్ణమైన అద్దాల ఇళ్లలోనే నివసిస్తున్నామని, అలాంటప్పుడు ఇతరుల ఇళ్లపై రాళ్లు రువ్వడం సరికాదని ఆమె అన్నారు. మనుషులుగా జీవించడానికి దయ, ఎదుటివారి బాధను అర్థం చేసుకునే తత్వం అవసరమని పేర్కొన్నారు.
అయితే ఈ పోస్ట్ పెట్టినంత మాత్రాన ఎవరూ తెలివితక్కువ ఊహాగానాలు మొదలుపెట్టవద్దని ఆమె కోరారు. తాను ఎవరి దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని, సరిగ్గా ఆలోచించి స్వయంగా రాశానని స్పష్టం చేశారు.
ఈ పోస్ట్‌లో ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, పవన్‌కు మద్దతుగానే రేణు దేశాయ్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.




