బూర్గంపహాడ్ రహదారి ప్రమాద సూచికలు, NewzFast Telugu (బూర్గంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం): జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు కొరవడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ, ప్రధాన రహదారులపై ప్రమాద సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లతో కూడిన సూచికలు, రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ బూర్గంపహాడ్ మండలంలో వాటి ఏర్పాటులో సంబంధిత అధికారులు విఫలమయ్యారని వాహనదారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.
మోరంపల్లిబంజర్ రింగ్ సెంటర్కు సమీపంలో అంజనాపురం నుండి వచ్చే సమయంలో వాహనాలకు ఎదురుగా హెచ్చరిక, ప్రమాద సూచిక బోర్డులు, రేడియం సూచికలు కనిపించకపోవడంతో ఎదురుగా ఉన్న డివైడర్ను వాహనాలు ఢీకొంటున్నాయని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మోరంపల్లిబంజర్, లక్ష్మీపురం, బూర్గంపహాడ్, సారపాక తదితర ప్రధాన ప్రాంతాల్లో ఇవి లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు జరిగినా అధికారులు స్పందించడంలేదని పలువురు వాహనదారులు మండిపడుతున్నారు. ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో పాటు బూర్గంపహాడ్-సారపాక వరకు జాతీయ రహదారి గుంతలమయంగా ఉండటంతో రాత్రి వేళల్లో ప్రమాదాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రధాన ప్రాంతాల్లో జాతీయ రహదారి, ప్రధాన రహదారుల వద్ద ప్రమాద సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లతో కూడిన సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు, మండల ప్రజలు కోరుతున్నారు.




