మంత్రి పొన్నం ప్రభాకర్, NewzFast Telugu (హుస్నాబాద్): రాజకీయాల్లో సోషల్ మీడియా కళ్లు, చెవులుగా మారి కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లకు ఆయన పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ, క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.
సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు. రుణమాఫీ లబ్ధిదారులతో వీడియోలు రూపొందించి ప్రచారం చేయాలన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జనవరిలో వందలాది కంపెనీలతో భారీ జాబ్‌మేళా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని, ఒక్కో గ్రామానికి రూ.లక్ష, పెద్ద గ్రామాలకు రూ.2 లక్షలు కేటాయిస్తామని చెప్పారు.
కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని, కబడ్డీ అకాడమీ, స్విమ్మింగ్ పూల్తో పాటు కళలు, నృత్యాల్లో శిక్షణకు సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. అన్ని గ్రామాల్లో తాగునీటి ఫిల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
దివ్యాంగులు, వృద్ధులకు అలింకో ద్వారా ఉచితంగా సహాయక పరికరాలు అందిస్తామని, అర్హులైన పేదలకే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆయన సూచించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో, హుస్నాబాద్ నియోజకవర్గానికి 5,230 కొత్త చేయూత పెన్షన్లు మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు. ఏడు రకాల పెన్షన్లకు 6,313 దరఖాస్తులు రాగా, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసినట్లు తెలిపారు.
వృద్ధాప్య పెన్షన్లపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
నవంబర్ 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇంటింటి కుటుంబ బీమా పథకం ప్రారంభమవుతుందని, త్వరలో హుస్నాబాద్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపడతామని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన పేదలకు ప్రాధాన్యమిస్తామన్నారు.
ఎల్లమ్మ చెరువు వద్ద గ్లాస్ బ్రిడ్జి, పర్యాటక అభివృద్ధి పనులను అందుబాటులోకి తెస్తామని, అక్కన్నపేట ఫోర్‌లేన్ రోడ్డుకు త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ, మ్యాపింగ్ చేపడతామన్నారు.
హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో 300 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించామని, తాత్కాలిక హాస్టల్ వసతి, రెండు బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యుత్ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపడతామన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి పనులపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో టీపీసీసీ చైర్మన్ పెట్టెం నవీన్, వైస్ చైర్మన్ అనురాగ్ దాసరపు, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఏడు మండలాల అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




