బోయినపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ, NewzFast Telugu (రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ): పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే సూచించారు. ఆయన మంగళవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలను పర్యవేక్షించడంలో భాగంగా ఈ తనిఖీ నిర్వహించారు. స్టేషన్లో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు.
ప్రతి కేసులో నిబంధనల ప్రకారం సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ రికార్డులు, కేసు డైరీలు, వివిధ రిజిస్టర్లను కూడా తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్కు వివిధ సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరిధిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. నేర నియంత్రణకు పెట్రోలింగ్, రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని, రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
గంజాయి, డ్రగ్స్, ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా గ్రామాలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఆన్లైన్ మోసాలు, ఓటీపీ, కేవైసీ మోసాలు, నకిలీ పెట్టుబడి యాప్లు, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడంతోపాటు హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదకర డ్రైవింగ్, మైనర్ల వాహన వినియోగం, మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




