రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, NewzFast Telugu (హైదరాబాద్): లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో ఆయన హైదరాబాద్‌కు రానున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో సుమారు అరగంట పాటు సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ‘భారత్ సమ్మిట్’లో పాల్గొననున్నారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ స్వయంగా కోరారని చెప్పారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం (గిగ్ యాక్ట్) తీసుకువచ్చిన నేపథ్యంలో, రాహుల్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే, హైదరాబాద్‌లో ‘సర్’కు వ్యతిరేకంగా నిర్వహించే సభతో పాటు, మెగా బీసీ ర్యాలీకి హాజరుకావాలని రాహుల్‌ను ఆహ్వానించామని, అయితే ఆ కార్యక్రమాల తేదీలు ఇంకా ఖరారు కాలేదని తెలిపారు.
రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఓబీసీల అంశం, వారికి కల్పిస్తున్న ప్రాతినిధ్యంపై చర్చించినట్లు టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. తెలంగాణలో పీసీసీ అమలు చేస్తున్న కార్యక్రమాలపై రాహుల్‌కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు.
బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను ఆయనకు వివరించామన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న గొడవలు, పంచాయితీలపై రాహుల్ గాంధీతో ఎలాంటి చర్చ జరగలేదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆ వ్యవహారాలను పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటారని తెలిపారు.
నవంబర్ నెలలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు.
మరోవైపు, సోనియా గాంధీ ఆత్మకథను తాము స్వాగతిస్తున్నామని, తెలంగాణలో ఆ పుస్తకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.




