హకా రైతు సేవా కేంద్రం, NewzFast Telugu (జగిత్యాల, తెలంగాణ): రైతులకు తక్కువ ధరలకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడమే హకా రైతు సేవా కేంద్రాల ప్రధాన లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ సమీపంలోని ఏఆర్ గార్డెన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హకా రైతు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు కేంద్రం అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వానాకాలం వరి కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బుధవారం చల్గల్‌లో జగిత్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కూడా అధిక మొత్తంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు, ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, నీరు మరియు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకుంటూ ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల ముకుందం, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొలిశెట్టి గంగారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అబ్బూరి మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




