అక్రమ ధాన్యం రవాణా, NewzFast Telugu (కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా): అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ధాన్యం తరలిస్తున్న రెండు లారీలను కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. మార్కెట్ నిబంధనల ప్రకారం వాటి నుంచి రూ.4,500 ఫీజు వసూలు చేసి వదిలిపెట్టారు.
మార్కెట్ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, తొర్రూరు నుంచి గూడూరు మండలం గోవిందాపురంలోని ఓ రైస్‌మిల్లుకు ధాన్యం తరలిస్తున్న రెండు లారీలను కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని గూడూరు రోడ్డులో సిబ్బంది తనిఖీ చేశారు. ఒక్కో లారీలో రూ.2 లక్షలకు పైగా విలువైన ధాన్యం ఉన్నట్లు గుర్తించారు.
రవాణాకు సంబంధించిన ఎగుమతి పత్రాలు లేకపోవడంతో లారీలను నిలిపివేశారు. ఈ క్రమంలో డ్రైవర్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించిన సిబ్బంది, నిబంధనల ప్రకారం ఒక లారీకి రూ.2,500, మరో లారీకి రూ.2,000 చొప్పున మార్కెట్ ఫీజు వసూలు చేసి వాటిని విడిచిపెట్టారు.




