కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, NewzFast Telugu (అచ్చంపేట, నడింపల్లి): కేజీబీవీల్లో విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, భోజన సదుపాయాలు, వసతి, ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించారు. 160 మంది విద్యార్థినులకు గాను ప్రస్తుతం 95 మంది మాత్రమే ఉన్నారని తెలుసుకుని, ఇంటర్మీడియట్లో 100 శాతం ప్రవేశాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి కుసుమను ఆదేశించారు.
విద్యార్థినులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినుల స్లిప్ టెస్టును పరిశీలించిన కలెక్టర్, మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు.
అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. విద్యార్థినులకు నాణ్యమైన పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గోపి పద్మ, మండల విద్యాధికారి శ్రీనివాసమూర్తి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




