పవన్ కళ్యాణ్ విడాకులు, NewzFast Telugu: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల తాము విడిపోతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, తమ వైవాహిక జీవితం ముగిసినా ఇకముందు మంచి స్నేహితులుగా కొనసాగుతామని వారు తెలిపారు.
పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా వ్యవహరిస్తామని కూడా వారు స్పష్టం చేశారు. ఈ సమయంలో తమను అర్థం చేసుకుని, సానుభూతితో వ్యవహరించాలని, తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఇద్దరూ విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిని గౌరవించాలని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నిర్ణయించాయి. ఈ మేరకు రెండు పార్టీలు తమ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి.
ఐటీడీపీ విడుదల చేసిన ప్రకటనలో, సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయంపై విమర్శలు లేదా వ్యాఖ్యలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఎవరైనా టీడీపీ నాయకుల పేరుతో వ్యక్తిగత విమర్శలు లేదా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే వాటితో ఐటీడీపీకి ఎలాంటి సంబంధం లేదని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది. వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
నేతల గోప్యతను గౌరవించాలని, రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలపై బహిరంగంగా వ్యాఖ్యానించవద్దని, సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని వైసీపీ తన శ్రేణులకు సూచించింది. నేరుగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండా, వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా విచక్షణ పాటించాలని కోరింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో పవన్ కళ్యాణ్‌కు మంచి అనుబంధం ఉంది. టీడీపీ, జనసేన పార్టీలు కూటమిలో కలిసి అధికారంలో భాగస్వాములుగా కొనసాగుతున్నందున టీడీపీ సానుకూలంగా స్పందించింది.
గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి బహిరంగ విమర్శలు చేసిన ప్రతిపక్ష వైసీపీ కూడా ఈసారి సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఏపీలో కూటమి, వైసీపీ మధ్య రాజకీయ వైరం ఉన్నప్పటికీ, ఈ వ్యక్తిగత అంశంలో ఇరు పక్షాలు సానుకూల ధోరణి ప్రదర్శించడం మంచి పరిణామమని చెప్పవచ్చు.




