ఎం. నాగేశ్వరరావు, NewzFast Telugu (ఉత్తరప్రదేశ్): భారతీయ దర్యాప్తు సంస్థ మాజీ తాత్కాలిక డైరెక్టర్, వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలిచే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
దాదాపు నెల రోజుల క్రితం కాశీలోని గంగా నది తీరాన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఆరంభించిన సర్వజన సనాతన పార్టీ ద్వారా ఆయన ఉత్తరప్రదేశ్ వేదికగా రాజకీయ అరంగేట్రం చేశారు. రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ప్రధాన శక్తిగా నిలుస్తుందని ప్రకటించిన ఆయన, రాష్ట్రంలోని మొత్తం 403 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.
ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థుల ఎంపిక కోసం తొలి విడత ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను నాగేశ్వరరావు అధికారికంగా ప్రారంభించారు. తన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ఆయన ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.
ఈ దరఖాస్తు ప్రాథమిక పరిశీలన కోసం మాత్రమేనని, 25 ఏళ్లు నిండి ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితాలో పేరున్న పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
పార్టీ సిద్ధాంతాలు, ప్రధాన లక్ష్యాలపై సంపూర్ణ విశ్వాసం కలిగిన వారికే ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు. ప్రాథమికంగా ఎంపికైన వారి నుంచి రెండవ దశలో ధ్రువపత్రాలు సేకరిస్తామని చెప్పారు.
బీజేపీ అనుసరిస్తున్నది సూడో-హిందూత్వ అని ఆరోపిస్తున్న నాగేశ్వరరావు, హిందూ ఓటర్లకు బీజేపీ మాత్రమే ప్రతినిధి కాదని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మం కేవలం ఒక పూజా విధానమో లేదా మతాచారమో కాదని, అది సత్యం, కరుణ, సమన్యాయంతో కూడిన జీవన విధానమని ఆయన పేర్కొన్నారు.
గతాన్ని మళ్లీ తిరగరాయడం తమ ఉద్దేశం కాదని, భారతీయ ప్రాచీన నాగరికతలోని అత్యుత్తమ వారసత్వాన్ని స్వీకరించి ఆధునిక ప్రగతి, సాంకేతికతతో సమ్మేళనం చేస్తూ రాబోయే తరాలకు అందించడమే పార్టీ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
అభ్యర్థులు సమర్పించే దరఖాస్తుల ఆధారంగా పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని, దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన టికెట్ హామీ ఉండదని నాగేశ్వరరావు స్పష్టం చేశారు.




