జియా ఉర్ రెహ్మాన్, NewzFast Telugu (షార్జా, యూఏఈ): ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలర్ జియా ఉర్ రెహ్మాన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 150కి పైగా పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు.
149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా ఈ చెత్త రికార్డును నమోదు చేయలేదు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జియా ఉర్ రెహ్మాన్ బౌలింగ్ గణాంకాలు ఆఫ్ఘనిస్తాన్‌కు శాపంగా మారాయి.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ విభాగానికి నాయకత్వం వహించిన 28 ఏళ్ల జియా ఉర్ రెహ్మాన్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీగా పరుగులు సమర్పించుకుని 173 పరుగులకు రెండు వికెట్లు తీశాడు.
దీంతో ఈ టెస్టులో మొత్తంగా 343 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ఈ క్రమంలో ఒకే టెస్ట్ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కనీసం 150 పరుగులు ఇచ్చిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు. 1877లో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరూ ఈ రికార్డును నమోదు చేయలేదు.
ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలోనూ జియా ఉర్ రెహ్మాన్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ బౌలర్ టామీ స్కాట్ 1930లో కింగ్‌స్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 374 పరుగులు ఇచ్చి అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ క్రెజ్జా 2008లో నాగ్‌పూర్‌లో భారత్‌తో జరిగిన టెస్టులో 358 పరుగులు సమర్పించుకున్నాడు.
టెస్ట్ చరిత్రలో ఆరుగురు బౌలర్లు ఏడు సందర్భాల్లో 300కు పైగా పరుగులు ఇచ్చారు. అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కనీసం ఐదు వికెట్లు తీయలేకపోయిన ఈ జాబితాలోని ఏకైక బౌలర్‌గా జియా ఉర్ రెహ్మాన్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.




